చేతివృత్తిదారులకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి
ఎన్నికల హామీని అమలు చేయాలని తోలేటి శ్రీకాంత్ డిమాండ్ విశ్వబ్రాహ్మణుల ఐక్యతతోనే సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి తపాలా కార్డులతో వినతి

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 25: స్వర్ణకారులు, వడ్రంగులు, కంచరులు, కమ్మరులు, శిల్పులతోపాటు చేతివృత్తులపై ఆధారపడిన వారందరికీ 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేయాలని వైఎస్సార్‌సీపీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలోని డీఎస్ఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తొలి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. పనులు లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో చేతివృత్తిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురజాడ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లోని విశ్వబ్రాహ్మణులను చైతన్యపరిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమానికి ముందు శ్రీ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్రస్వామి పీఠం అధ్యక్షుడు చింతాడ బ్రహ్మానందం పూజలు నిర్వహించారు. చేతివృత్తిదారులకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి తపాలా కార్డుల ద్వారా వినతులు పంపించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మెడపి ప్రసాద్, వేముల రామకృష్ణ, కిల్లంపల్లి ఆచారి, కొండిపర్తి రాజశేఖర్, కల్లూరి శ్రీవాణి, వేముల కన్నబాబు, బి శారద తదితరులు పాల్గొన్నారు.

