మూలా నక్షత్రం వేళ భక్తజన సందోహం
అదనంగా 1,200 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు… రద్దీ నియంత్రణకు 54 రోప్ పార్టీల ఏర్పాటు… అర్ధరాత్రి నుంచే సీపీ, కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ…

విజయవాడ, అక్టోబర్ 16: మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి నుంచే భక్తుల రాక పెరగడంతో క్యూలైన్లు, మూడు హోల్డింగ్ ప్రాంతాల్లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ, ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించేందుకు పోలీసు శాఖ బందోబస్తును మరింత పటిష్ఠం చేసింది. అదనంగా 1,200 మంది సిబ్బందితో 54 రోప్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టింది. నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అర్ధరాత్రి నుంచే కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యూలైన్లు, హోల్డింగ్ ప్రాంతాల్లో భక్తుల కదలికలను పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చారు. హోల్డింగ్ ప్రాంతాలు నిండిపోవడంతో కార్పస్ బ్రిడ్జి నుంచి గద్దబొమ్మ సెంటర్ వరకు ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. సీపీ, కలెక్టర్ ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బందోబస్తు నిర్వహణపై ఆరా తీశారు. భక్తులతో సంయమనంతో వ్యవహరించాలని, తొక్కిసలాటకు అవకాశం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఏదైనా అసౌకర్యం ఎదురైతే సమీపంలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తెలియజేయాలని సూచించారు. అనంతరం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఆలయం వరకు ఉన్న క్యూలైన్లు, హోల్డింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

