దుర్గమ్మకు కనకమహాలక్ష్మి దేవస్థానం సారె
చైర్మన్ కందుల నాగరాజు, ఈవో శోభారాణి సమర్పణ… పాలకమండలి సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం… వేదాశీర్వచనం అందించిన వేదపండితులు…

విజయవాడ, అక్టోబర్ 17: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం తరఫున కనకదుర్గమ్మవారికి శనివారం మధ్యాహ్నం సారె సమర్పించారు. దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, కార్యనిర్వహణాధికారి కె. శోభారాణి, పాలకమండలి సభ్యురాలు బేబీ శోభారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన కనకమహాలక్ష్మి దేవస్థానం ప్రతినిధులకు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

