సింగ్‌నగర్‌లో విజయవాడ ఉత్సవ్–2కు అంకురార్పణ
మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాట్ల పనులకు శంకుస్థాపన… ఆధ్యాత్మికత, సంస్కృతి, కళల మహా సంగమంగా నిర్వహణ… 20న నాలుగు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 5: దసరా శోభను మరింత ఇనుమడింపజేసేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2 ఏర్పాట్లకు సోమవారం అంకురార్పణ జరిగింది. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉత్సవ పనులకు యువ నాయకుడు బొండా సిద్ధార్థ, గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ తేజస్విని, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ గతేడాది విజయవాడ ఉత్సవ్‌కు ప్రజల నుంచి లభించిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుర్గమ్మ, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికత, ఆహ్లాదం, కళలు, సంస్కృతుల సమ్మేళనంగా ఉత్సవాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. పున్నమిఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాకారులు, గాయకులు, సాంస్కృతిక బృందాలతోపాటు స్థానిక కళాకారులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. లేజర్, డ్రోన్, క్రాకర్ ప్రదర్శనలు, ప్రత్యక్ష సంగీత బృందాలు, సంగీత కచేరీలు ఉత్సవాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

విద్యార్థులు, యువత, మహిళలు, కుటుంబాలు భాగస్వాములయ్యేలా ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 20న మూడు గజరాజులు, అమ్మవారి తొమ్మిది అవతారాల ప్రతిరూపాలు, సుమారు నాలుగు వేల మంది కళాకారులతో ఏలూరు రోడ్డులో భారీ కార్నివాల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. గొట్టిముక్కల రఘు మాట్లాడుతూ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ ఫార్మా కళాశాల, పవిత్ర సంగమం ప్రాంతాల్లో విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కల్చరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ తేజస్విని మాట్లాడుతూ రాష్ట్రంలోని 40 నుంచి 45 రకాల జానపద, సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, ప్రముఖ గాయకులు, భజన బృందాలు ప్రజలను అలరించనున్నాయని చెప్పారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

