అల్ హక్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
రూ.75 లక్షల విలువైన 175 గజాల స్థలాన్ని దానం చేసిన దాతలు నిర్మాణానికి ప్రజల నుంచి రూ.46 లక్షల విరాళాల సేకరణ దాతల పరోపకారం అభినందనీయం: ఎమ్మెల్యే యార్లగడ్డ


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, సెప్టెంబర్ 23 : గన్నవరం జాతీయ రహదారిలోని ఆల్ఫా హోటల్ సమీపంలో అల్ హక్ మసీదు నిర్మాణానికి బుధవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. మర్కజ్ జమియత్ అహ్లే హదీస్ హింద్, మస్జిద్ యే అల్ హక్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారు, శాసనమండలి మాజీ చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్‌తో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మసీదు నిర్మాణానికి 175 గజాల స్థలాన్ని రూ.75 లక్షలతో కొనుగోలు చేసి దానం చేయడంతోపాటు ప్రజల నుంచి రూ.46 లక్షల విరాళాలు సమీకరించడం అభినందనీయమని యార్లగడ్డ అన్నారు. స్థలదాత దివంగత మహ్మద్ ఫజ్లుల్ హక్ కుటుంబ సభ్యులు అఫ్సర్ సుల్తానా తదితరుల ఉదారతతోనే పవిత్ర కార్యానికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు.

ఆస్తులు, సంపదను సమాజహితం కోసం వినియోగించే దాతలు అందరికీ ఆదర్శమన్నారు. అమరావతిని కాపాడటంలో షరీఫ్‌ది కీలకపాత్ర రాజధాని అమరావతిని పరిరక్షించడంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ కీలకపాత్ర పోషించారని యార్లగడ్డ కొనియాడారు. రాజధాని మార్పునకు సంబంధించిన బిల్లును నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపిన ఆయన నిర్ణయం చారిత్రకమన్నారు. అమరావతి రైతుల ఉద్యమం, ప్రజల పోరాటాలు, న్యాయపోరాటాలతోపాటు షరీఫ్ తీసుకున్న నిర్ణయం కూడా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీదు అధ్యక్షుడు ఎస్‌కే అహ్మద్ హుస్సేన్, టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, షేక్ హాజీ, తాళ్లూరు రెహ్మాన్, గూడపాటి తులసీమోహన్, దొంతు చిన్న, బుస్సే నాగప్రసాద్, మేడేపల్లి రమ, చిమటా రవివర్మ, గండేపూడి నితీష్, షేక్ రఫీతోపాటు కూటమి నాయకులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
