కాకినాడ కుటుంబ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలి
సౌజన్య సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి: దోనేపూడి శంకర్... బ్లాక్మెయిల్, హత్య, ఆస్తుల కాజేత, మత మార్పిడి ఒత్తిడి ఆరోపణలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణకు డిమాండ్... ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...

విజయవాడ, ఆగస్టు 25: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబానికి సంబంధించిన ఆత్మహత్యల ఉదంతంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. కుటుంబం ఎదుర్కొన్నట్లు చెబుతున్న తీవ్ర మానసిక క్షోభ, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు అత్యంత దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు.
బాధితురాలు సౌజన్య రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో ప్రస్తావించిన అంశాలను దర్యాప్తు సంస్థలు తీవ్రంగా పరిగణించాలని శంకర్ కోరారు. సాదిక్ అనే వ్యక్తి ప్రైవేటు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని, భర్తను హతమార్చాడని, ఆస్తులను కాజేశాడని, మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని వస్తున్న ఆరోపణలన్నింటిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో కుల, మతాలకు అతీతంగా వాస్తవాలను వెలికితీయాలని, విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఆరోపణలు రుజువైతే ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సైబర్ బ్లాక్‌మెయిలింగ్, గృహహింసకు గురవుతున్న మహిళలకు సత్వర సహాయం అందేలా రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని శంకర్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టి, నేరం రుజువైన వారికి కఠిన శిక్షలు పడేలా చేసినప్పుడే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని దోనేపూడి శంకర్ స్పష్టం చేశారు.

