మూడు దశాబ్దాల కల.. సాకారమవుతున్న వేళ
1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా: సీఎం చంద్రబాబు... 30 ఏళ్ల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నానని వెల్లడి... ఈ నెల 31న 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేస్తామని ప్రకటన...

అమరావతి, ఆగస్టు 25: ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు మూడు దశాబ్దాల క్రితం తాను చేసిన సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోందని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు గురించి చంద్రబాబు మాట్లాడుతూ 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. అప్పట్లో ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అదే ప్రాజెక్టును తన చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కరువు ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఈ నెల 31న 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నీటితో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా వెలిగొండ ప్రాజెక్టు కీలక అడుగుగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
