కృష్ణమ్మ గుండె కోతపై మౌనమేనా..?
పవిత్ర సంగమంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు... ‘పూడికతీత’ పేరుతో నదీగర్భాన్ని తవ్వేస్తున్నారంటూ రైతుల ఆందోళన... లంక భూములకు ముప్పు పొంచి ఉందని ఆవేదన.. అధికారులు స్పందించాలని డిమాండ్...

మైలవరం: ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై లంక భూముల రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూడికతీత పేరుతో భారీ డ్రెడ్జింగ్ యంత్రాలను ఉపయోగించి కృష్ణానది గర్భాన్ని పెద్దఎత్తున తవ్వుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ తవ్వకాల కారణంగా నదీ ప్రవాహ స్వరూపం మారి, కృష్ణానదిని ఆనుకుని ఉన్న లంక భూములకు భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర సంగమం పరిసరాల్లో భారీ యంత్రాలతో నదీగర్భంలో జరుగుతున్న పనులు ఏ నిబంధనల ప్రకారం చేపడుతున్నారో అధికారులు స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. పూడికతీతకు అనుమతులు ఎంత విస్తీర్ణానికి ఇచ్చారు? ఎంత లోతు వరకు తవ్వేందుకు అనుమతి ఉంది? తవ్విన ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై మైనింగ్ శాఖ పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. నదీగర్భంలో విచ్చలవిడిగా తవ్వకాలు జరిగితే వరదల సమయంలో లంక భూములపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ జీవనాధారమైన భూముల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ శాఖ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రైతులు కోరుతున్నారు. తవ్వకాలకు ఉన్న అనుమతులు, నిబంధనలు పరిశీలించి అక్రమాలు ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లంక భూముల రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని తమ భూములకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

