డీజేల హోరు.. గన్నవరంలో జనం బేజారు!
పగలు, రాత్రి తేడా లేకుండా భారీ శబ్దాలు వృద్ధులు, రోగులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

గన్నవరం, సెప్టెంబరు 4 : గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో శుభకార్యాలు, ఊరేగింపులు, వేడుకల పేరుతో వినియోగిస్తున్న డీజేల భారీ శబ్దాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తున్నారని, సంబంధిత అధికారులు తగిన నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్దేశిత శబ్ద పరిమితులు, సమయ నిబంధనలను పాటించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటిని బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీజేల నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలు, ప్రకంపనలతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. పోలీసుల పర్యవేక్షణ ఏది? రాత్రి వేళల్లోనూ డీజేలు కొనసాగుతున్నప్పటికీ గస్తీ పోలీసులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా? నిర్దేశిత సమయాలు, శబ్ద పరిమితులు పాటిస్తున్నారా? అనే అంశాలపై తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తున్నట్లు తేలితే నిర్వాహకులు, పరికరాల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధులు, రోగులకు ఇక్కట్లు మితిమీరిన శబ్దాలతో వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలున్నవారు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా శబ్ద తీవ్రత పెరగడంతో ఆందోళనకు గురవుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. చిన్నారులు భయంతో నిద్రపోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకు ఆటంకం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డీజేల శబ్దం తీవ్ర ఆటంకంగా మారిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించి, ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

