భక్తుల సౌకర్యాల పేరుతో అధిక వసూళ్లా?
ఇంద్రకీలాద్రిపై నిర్ణీత రుసుములకు మించి వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు... క్లాక్‌రూమ్‌లో రూ.10కు బదులు రూ.20.. చెప్పుల స్టాండ్‌లో రూ.3కు బదులు రూ.5 అంటూ ఫిర్యాదు... రుసుముల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని సాయికుమార్ నాగోతీ డిమాండ్...

విజయవాడ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న క్లాక్‌రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ ఫోన్ భద్రపరిచే కౌంటర్ల వద్ద నిర్ణీత రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సాయికుమార్ నాగోతీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దేవస్థానం అధికారుల దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు.
క్లాక్‌రూమ్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో లగేజీకి రూ.10గా పేర్కొన్నప్పటికీ భక్తుల నుంచి రూ.20 వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భక్తులకు ఇచ్చే టోకెన్‌పై చెల్లించిన రుసుము వివరాలు స్పష్టంగా ఉండటం లేదని పేర్కొన్నారు. అలాగే చెప్పుల స్టాండ్ వద్ద జతకు రూ.3గా బోర్డులో పేర్కొని రూ.5 తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్ భద్రపరిచేందుకు రూ.5 వసూలు చేస్తున్న నేపథ్యంలో అన్ని కౌంటర్ల వద్ద అధికారిక రుసుములను స్పష్టంగా ప్రదర్శించాలని కోరారు.
భక్తులకు ఎలాంటి సందేహాలకు తావులేకుండా తెలుగు, ఆంగ్ల భాషల్లో రుసుముల పట్టికలను ఏర్పాటు చేయాలని సూచించారు. చెప్పుల భద్రపరిచే సేవను ఉచితంగా అందించే అంశాన్ని దేవస్థానం పరిశీలించాలని కోరారు.
నిర్ణీత రుసుములకు మించి వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై దేవస్థానం అధికారులు విచారణ జరపాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సాయికుమార్ డిమాండ్ చేశారు. భక్తులకు పారదర్శకంగా సేవలు అందించేలా దేవస్థానం యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు.

