వలకు చిక్కిన ‘భారీ’ అదృష్టం!
మచిలీపట్నం మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప... కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలింపు... వేలంలో మంచి ధర రావడంతో మత్స్యకారుల హర్షం...

మచిలీపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): మచిలీపట్నం మత్స్యకారుల వలకు సముద్రంలో భారీ చేప చిక్కింది. భారీ ఆకారంలో ఉన్న చేపను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. అనంతరం క్రేన్ సహాయంతో దానిని వాహనంలోకి ఎక్కించి కాకినాడలోని కుంభాభిషేకం రేవుకు తరలించినట్లు సమాచారం.
అక్కడ నిర్వహించిన బహిరంగ వేలంలో వ్యాపారులు పోటీపడగా చేప రూ.58 వేలకు విక్రయమైనట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. భారీ చేపను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
కాకినాడ కుంభాభిషేకం రేవు భారీ చేపల వేలానికి పేరొందిన ప్రాంతం. ఈ ఏడాది జనవరి చివర్లోనూ అక్కడ పెద్దఎత్తున భారీ చేపలను బహిరంగ వేలంలో విక్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి.

