ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య ప్రజా దర్బార్... ప్రజల నుంచి వినతుల స్వీకరణ... అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశాలు...

నందిగామ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, నిబంధనల మేరకు వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం మరింత చేరువ కావాలన్నదే ప్రజా దర్బార్ ఉద్దేశమని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సౌమ్య హామీ ఇచ్చారు.

