బడికి డుమ్మా కొడితే ఉద్యోగానికే ఎసరు
ఏడాది అనుమతి లేకుండా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు... ఐదేళ్లు దాటితే స్వచ్ఛంద రాజీనామాగా పరిగణన... నిర్లక్ష్యం చేసే హెచ్ఎంలు, ఎంఈఓలు, డీఈఓలపైనా చర్యలు...

హైదరాబాద్, ఆగస్టు 14 (V10TV): ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు సక్రమంగా హాజరుకాకుండా దీర్ఘకాలం గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాది పాటు విధులకు దూరంగా ఉండే ఉద్యోగులపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపట్టి ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వరుసగా ఐదేళ్ల పాటు విధులకు హాజరుకాని వారిని స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగికి ఐదేళ్లకు మించి సెలవు మంజూరు చేసే అవకాశం లేదని విద్యాశాఖ పేర్కొంది. విదేశాలకు వెళ్లి అనుమతించిన గడువు ముగిసిన తర్వాత కూడా విధుల్లో చేరని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికీ ఇదే నిబంధనలు వర్తించనున్నాయి. గైర్హాజరైన ఉద్యోగులను గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి, సీసీఏ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది.
బోధనకు ఆటంకం
ఉపాధ్యాయులు అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు రాకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై ప్రభావం పడుతోందని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థుల చదువులకు నష్టం జరగకుండా గైర్హాజరు కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈఓలకు స్పష్టం చేసింది.
అధికారులపైనా నిఘా
గైర్హాజరయ్యే ఉపాధ్యాయుల వివరాలను దాచిపెట్టినా, వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసినా సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలను బాధ్యులను చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. ప్రతి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గైర్హాజరు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సంబంధించిన ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి ఎప్పటికప్పుడు వివరాలను నవీకరించాలని ఆదేశించారు.
అనుమతి లేకుండా గైర్హాజరైన కాలాన్ని **‘డైస్ నాన్’**గా పరిగణించనున్నారు. ఆ కాలానికి జీతభత్యాలు చెల్లించకపోవడంతో పాటు సీనియారిటీ, ఇంక్రిమెంట్లు, పెన్షన్ వంటి ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

