హెల్మెట్ శిరోభారం కాదు.. ప్రాణాలకు రక్షణ
▪️ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు... ▪️ మచిలీపట్నంలో పోలీసుల హెల్మెట్ అవగాహన ర్యాలీ.. స్వయంగా బైక్ నడిపిన ఎస్పీ... ▪️ జరిమానాకు భయపడి కాదు.. ప్రాణాలపై ప్రేమతో హెల్మెట్ ధరించాలని పిలుపు...

వీ10టీవీ (ప్రతినిధి), మచిలీపట్నం: ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్ శిరోభారం కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను భారంగా కాకుండా బాధ్యతగా భావించి తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.
మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కోనేరు సెంటర్, రేవతి సెంటర్, బస్టాండ్, లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా జడ్పీ కన్వెన్షన్ హాల్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడటానికి, ప్రాణాలు కోల్పోవడానికి తలకు తగిలే గాయాలు ప్రధాన కారణాల్లో ఒకటన్నారు. ‘కొద్ది దూరమే కదా.. హెల్మెట్ ఎందుకు?’ అనే నిర్లక్ష్యపు ఆలోచన వద్దని హెచ్చరించారు. ఒక్క క్షణంలో జరిగే ప్రమాదం కుటుంబాన్ని జీవితాంతం విషాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు.
ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత దూరం ప్రయాణించినా ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడుకున్నవారవుతారని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పోలీసుల భయంతో కాకుండా వ్యక్తిగత బాధ్యతగా పాటించాలని ఎస్పీ సూచించారు. హెల్మెట్ ధరించకపోతే విధించే జరిమానా ప్రజలపై పోలీసులకు ఉన్న కోపంతో కాదని, చట్టాన్ని ఉల్లంఘించినందుకు తీసుకునే చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.
“జరిమానాకు భయపడి కాదు.. ప్రాణాలపై ప్రేమతో హెల్మెట్ ధరించండి. మీ కుటుంబం కోసం.. మీ భవిష్యత్తు కోసం ప్రతి ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి” అని ఎస్పీ పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకరించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలమన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా నాణ్యమైన హెల్మెట్ ధరించేలా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

