ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ విస్తృత ప్రచారం
▪️ పాతబస్తీ, విద్యాధరపురంలో ఇంటింటికీ కరపత్రాల పంపిణీ... ▪️ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు చేయలేదని జి. కోటేశ్వరరావు విమర్శ... ▪️ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే వామపక్షాలను ఆదరించాలని పిలుపు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
వీ10టీవీ విజయవాడ, ఆగస్టు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా పాతబస్తీలోని 50వ డివిజన్, విద్యాధరపురం పరిధిలోని 45వ డివిజన్లో నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు.
రైతుల రుణమాఫీకి నిధులు లేవని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మాత్రం రాయితీలు కల్పిస్తోందని ఆరోపించారు. బ్యాంకుల్లో సామాన్య ప్రజలు దాచుకున్న సొమ్ముపై వివిధ రకాల ఛార్జీలు విధించడం సరికాదన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం తదితర హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమైందని కోటేశ్వరరావు విమర్శించారు.
విజయవాడ నగర అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. 2024లో బుడమేరు వరదల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని గుర్తుచేస్తూ, బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం ప్రకటించిన చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

నగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు నివాస స్థలాలు, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, కొండ ప్రాంతాల్లోని రెవెన్యూ పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని, మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, సబ్‌వేలు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే వామపక్ష అభ్యర్థులను ఆదరించాలని కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
50వ డివిజన్లోని మహంతిపురం, గొల్లపాలెం గట్టు ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యుడు తాడి పైడయ్య, డివిజన్ కార్యదర్శి మోకా దుర్గారావు, పిట్ట అప్పారావు, ఒడుగు సూర్యనారాయణ, వెంకటరమణ, హకీమ్ పాల్గొన్నారు.
45వ డివిజన్ పరిధిలోని రోటరీనగర్, బ్రహ్మయ్య కాలనీ, భగత్‌సింగ్ నగర్, కబేలా సెంటర్ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ, డివిజన్ సహాయ కార్యదర్శులు ఎర్రసాని జోసఫ్, అంజూరి సూరిబాబు, ఏవీ రంగారావు, పడాల తవుడమ్మ, గుణసుందరి, అప్పికొండ లక్ష్మి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు

