కృష్ణా జిల్లాలో నేరాలకు కళ్లెం
▪️ మహిళలపై నేరాలు 42 శాతం.. కిడ్నాప్ కేసులు 53 శాతం తగ్గుదల... ▪️ రోడ్డు ప్రమాదాలు 18 శాతం తగ్గగా.. ఆస్తి రికవరీ 58 శాతానికి పెరుగుదల... ▪️ అర్ధవార్షిక నేర సమీక్షలో పోలీసుల పనితీరుపై ఐజీపీ అశోక్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష...

వీ10టీవీ : కృష్ణా జిల్లాలో నేరాల నియంత్రణకు చేపట్టిన ముందస్తు చర్యలు, నిఘా, పెట్రోలింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం సత్ఫలితాలు ఇస్తున్నాయని జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది. మహిళలపై నేరాలు, కిడ్నాప్‌లు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు సహా పలు విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు తెలిపింది.
మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో 2026 అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి. అశోక్ కుమార్ సమావేశానికి హాజరై జిల్లాలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు.
మహిళలపై నేరాలు 42 శాతం తగ్గుదల
మహిళలపై నేరాలకు సంబంధించి 2025లో 469 కేసులు నమోదు కాగా 2026లో 274 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా 42 శాతం తగ్గుదల నమోదైంది. అత్యాచార కేసులు 17 నుంచి 3కు తగ్గి 82 శాతం తగ్గుదల నమోదైనట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి కేసును సున్నితంగా, వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ ఆదేశించారు.
కిడ్నాప్‌లు 53 శాతం తగ్గాయి
కిడ్నాప్ కేసులు 2025లో 70 నమోదు కాగా 2026లో 33కు తగ్గినట్లు తెలిపారు. మిస్సింగ్ కేసులను సాధారణంగా చూడకుండా ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకుని బాధితులను త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
దొంగతనాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు
సాధారణ దొంగతనాల కేసులు 299 నుంచి 210కి తగ్గడంతో 30 శాతం తగ్గుదల నమోదైంది. మొత్తం ఆస్తి సంబంధిత నేరాలు 23 శాతం తగ్గినట్లు వెల్లడించారు. బీట్ పెట్రోలింగ్, సీసీ కెమెరాల వినియోగం, అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తుల కదలికలపై నిఘాను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.
ఆస్తి రికవరీ శాతం 2025లో 50 శాతం ఉండగా 2026లో 58 శాతానికి పెరిగింది. కేసుల ఛేదన శాతం 49 నుంచి 60 శాతానికి పెరిగినట్లు తెలిపారు. రూ.3.53 కోట్ల విలువైన ఆస్తి నష్టం నమోదవగా రూ.2.06 కోట్లకు పైగా ఆస్తిని పోలీసులు రికవరీ చేసినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల్లోనూ తగ్గుదల
2025తో పోలిస్తే 2026లో మొత్తం రోడ్డు ప్రమాదాలు 18 శాతం తగ్గినట్లు సమీక్షలో వెల్లడైంది. ప్రాణాంతక ప్రమాదాలు 28 శాతం, ప్రమాద మరణాలు 30 శాతం తగ్గాయి. నాన్‌ఫాటల్ ప్రమాదాలు 9 శాతం, గాయపడిన వారి సంఖ్య 6 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
కీలక కేసుల ఛేదన
కృత్తివెన్నులో ప్రత్యక్ష ఆధారాలు లేని డబుల్ మర్డర్ కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించడం, గన్నవరం సబ్ డివిజన్‌లో మహిళ హత్య కేసును ఛేదించి సుమారు రూ.56 లక్షల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకోవడం వంటి కేసులను సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మూడు నెలల్లో సుమారు రూ.60 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు తెలిపారు. గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.16 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పెరిగిన నేరాలపై ప్రత్యేక దృష్టి
కొన్ని విభాగాల్లో నేరాలు పెరిగిన విషయాన్ని కూడా సమీక్షించారు. హత్యలు, కల్పబుల్ హోమిసైడ్, గ్రీవియస్ హర్ట్, పగటిపూట ఇళ్ల దొంగతనాలు వంటి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసు వెనుక ఉన్న స్థానిక కారణాలను గుర్తించి నేరం పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గణాంకాల్లో నేరాలు తగ్గాయని సంతృప్తి చెందకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల మూల కారణాలను గుర్తించి శాశ్వత నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
అనంతరం నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఐజీపీ అశోక్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

