పాత నోటుకు భారీ ధర.. రూ.78 వేలు మాయం!
ఫేస్‌బుక్ ప్రకటన నమ్మి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో కృష్ణలంక వాసి... రూ.5, రూ.500 పాత నోట్లు.. 786 సిరీస్‌కు అధిక ధర ఇస్తామంటూ ఎర... నోట్లు కొనుగోలు చేస్తామంటూ నమ్మించి బాధితుడి నుంచి నగదు కాజేసిన మోసగాళ్లు...

విజయవాడ క్రైమ్, ఆగస్టు 27: పాత కరెన్సీ నోట్లకు భారీ ధర చెల్లిస్తామంటూ ఫేస్‌బుక్‌లో కనిపించిన ప్రకటనను నమ్మిన విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఏకంగా రూ.78 వేల నగదును కోల్పోయాడు.
కృష్ణలంకకు చెందిన కామేశ్వరరావుకు ఫేస్‌బుక్‌లో పాత రూ.5, రూ.500 నోట్లు, 786 సిరీస్ నోట్లు ఉంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ ఓ ప్రకటన కనిపించింది. తన వద్ద అలాంటి నోట్లు ఉన్నాయని భావించిన ఆయన ప్రకటనలోని వివరాల ఆధారంగా సైబర్ నేరగాళ్లను సంప్రదించారు.
ఇదే అదనుగా తీసుకున్న కేటుగాళ్లు ఆ పాత నోట్లను భారీ ధరకు కొనుగోలు చేస్తామని కామేశ్వరరావును నమ్మించారు. వారి మాటలు నిజమేనని నమ్మిన బాధితుడి నుంచి వివిధ కారణాలతో డబ్బులు తీసుకుంటూ చివరకు రూ.78 వేలు కాజేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు అనంతరం జరిగిన విషయాన్ని వెల్లడించారు.
పాత నోట్లు, అరుదైన సీరియల్ నంబర్లకు లక్షల రూపాయలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మోసాల్లో ముందుగా చిన్న మొత్తంలో రిజిస్ట్రేషన్ లేదా ఇతర ఫీజులు అడిగి, తర్వాత వరుసగా డబ్బులు వసూలు చేసే విధానం కనిపిస్తోంది.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సూచిస్తోంది.

