అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిన 35,544 మందికి ప్రాధాన్యం మిగిలిన 6,987 మంది కొనుగోలుదారుల వివరాల పరిశీలన బాండ్‌దారుల ధ్రువీకరణకు 20 ప్రత్యేక బృందాల ఏర్పాటు

అమరావతి, సెప్టెంబర్ 24: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం, రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ప్లాట్ కొనుగోలుదారులు, బాండ్‌దారులు, ప్లాంటేషన్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మొత్తం 42,531 మంది బోనాఫైడ్ ప్లాట్ కొనుగోలుదారుల్లో 35,544 మందికి రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి ప్రాధాన్యం ఇస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ పూర్తికాని 6,987 మంది వివరాలను పరిశీలించి తదుపరి దశలో సమస్యను పరిష్కరించనున్నారు. బాండ్‌దారుల వివరాలను ధ్రువీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిగోల్డ్ ప్లాంటేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి విలువను పారదర్శకంగా అంచనా వేయాలని నిర్ణయించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

