గుడివాడకు కొత్త రూపు
రూ.40 కోట్లతో రోడ్లు, డివైడర్లు, లైటింగ్, పార్కుల అభివృద్ధి రహదారులకు అదనంగా మరో రూ.50 కోట్లు ఎన్టీఆర్ హయాంలోలా పట్టణాన్ని బ్రాండ్‌గా నిలుపుతాం: ఎమ్మెల్యే రాము


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 22 : గుడివాడ పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, ఎన్టీఆర్ హయాంలో ఉన్న ప్రత్యేక గుర్తింపును తిరిగి తీసుకొస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో రూ.11,360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో గుడివాడలో రూ.40 కోట్లతో రోడ్లు, సెంట్రల్ డివైడర్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గుడివాడ సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అధికారులు, కూటమి నాయకులు తిలకించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 90 ఏళ్ల చరిత్ర కలిగిన గుడివాడ పురపాలక సంఘం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి వ్యవస్థలు అధ్వానంగా మారాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను గుర్తిస్తూ పరిష్కరిస్తోందని తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్ట తెగిపోయినా గత ప్రభుత్వం నాలుగేళ్లపాటు పట్టించుకోలేదన్నారు. మరమ్మతులకు రూ.4 కోట్ల అంచనాలు రూపొందించగా, కూటమి ప్రభుత్వం కేవలం రూ.13 లక్షలతో పనులు పూర్తిచేసి చెరువును అందుబాటులోకి తీసుకొచ్చిందని వివరించారు. ప్రతి వీధిలో

పూర్తిస్థాయి రోడ్లు గుడివాడ పట్టణ రహదారుల అభివృద్ధికి అదనంగా మరో రూ.50 కోట్లు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి వీధిలో ఒక చివరి నుంచి మరో చివరి వరకు పూర్తిస్థాయి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజలు కాలికి దుమ్ము అంటకుండా ఇంటికి చేరుకునే స్థాయిలో రహదారులను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. అమృత్ పథకం ద్వారా ఎస్‌ఎస్ ట్యాంకులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి వార్డుల్లో పనులు సెప్టెంబర్ 25 నుంచి 29వ తేదీ వరకు పట్టణంలోని వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించాలని అధికారులకు, కూటమి నాయకులకు సూచించారు. ప్రతి వీధిలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువ కావాలని కోరారు. లాభాపేక్షతో కాకుండా గుడివాడపై ఉన్న ప్రేమతోనే అభివృద్ధికి కృషి చేస్తున్నానని రాము స్పష్టం చేశారు. ఎన్టీఆర్ గుడివాడకు తీసుకొచ్చిన ప్రత్యేక గుర్తింపును తిరిగి సాధించి, పట్టణాన్ని ఒక బ్రాండ్‌గా నిలపడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు, అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి కొత్త గుడివాడ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, కూటమి పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, 36 వార్డుల పార్టీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
