బెజవాడలో తొలి ఏకగ్రీవం టీడీపీ ఖాతాలో!
64వ డివిజన్లో వీరమాచనేని లలితా కిషోర్ ఏకగ్రీవ ఎన్నిక… ప్రత్యర్థులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ… లలితా కిషోర్‌కు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి…

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తొలి ఏకగ్రీవ విజయం తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరింది. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వీరమాచనేని లలితా కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి అభ్యర్థులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆమె ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకగ్రీవ ఎన్నికను ధ్రువీకరిస్తూ ఆమెకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల పోరు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లలితా కిషోర్‌ను అభినందించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథానికి ఈ ఏకగ్రీవ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 64వ డివిజన్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని బొండా ఉమ అన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని లలితా కిషోర్‌కు సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

