నగరాభివృద్ధిలో నూతన కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించాలి
36, 40 డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దాలి… ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి… జనసేన కార్పొరేటర్లను అభినందించిన ఆకుల శ్రీనివాస్ కుమార్…

విజయవాడ, నవంబర్ 9 : విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి నూతన కార్పొరేటర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీనియర్ రాజకీయ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం భవానిపురంలోని తన కార్యాలయంలో కూటమి తరఫున జనసేన అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన 36వ డివిజన్ కార్పొరేటర్ ఏలూరి సాయి శరత్, 40వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల అరుణ్‌లను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాలకు అనుగుణంగా వంగవీటి రాధాకృష్ణ నాయకత్వంలో సామాన్యులు, అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించే సంప్రదాయం కొనసాగుతోందన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన యువ కార్పొరేటర్లు తమ డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి 36, 40 డివిజన్లను ఆదర్శ డివిజన్లుగా తీర్చిదిద్దాలని కోరారు. పేదలు, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతోపాటు విజయవాడ నగర ముఖచిత్రాన్ని మార్చే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి ఆకుల శ్రీనివాస్ కుమార్ చేసిన కృషిని కొనియాడారు. భవిష్యత్తులోనూ కూటమి బలోపేతానికి ఆయన సహకారం అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

