గుడివాడలో కూటమి జోరు.. మూడు జడ్పీటీసీలు క్లీన్‌స్వీప్!
32 ఎంపీటీసీల్లో 28 స్థానాలు కైవసం… నందివాడలో చారిత్రక విజయం సాధించాం: ఎమ్మెల్యే రాము… పదవులు అలంకారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత…

గుడివాడ, నవంబర్ 9: గుడివాడ నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మూడు జడ్పీటీసీ స్థానాలతోపాటు 32 ఎంపీటీసీ స్థానాల్లో 28 స్థానాలను కూటమి కైవసం చేసుకుందని తెలిపారు. సోమవారం గుడివాడ ప్రజావేదికలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజేతలను అభినందించి, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నందివాడలో చరిత్ర సృష్టించాం నందివాడ మండలంలో 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారిగా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను సాధించామని ఎమ్మెల్యే రాము వెల్లడించారు. గుడ్లవల్లేరులో 2024 ఎన్నికలతో పోలిస్తే కూటమికి మరింత ప్రజాదరణ పెరిగిందన్నారు. పలు గ్రామాల్లో 69 నుంచి 71 శాతం వరకు ఓట్లు కూటమికి లభించాయని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకత్వానికే ఓటర్లు పట్టం కడతారని ఈ ఫలితాలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. ఓడిన నాలుగు స్థానాల బాధ్యత నాదే నియోజకవర్గంలో నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో ఎదురైన ఓటమికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలను గుడివాడ సాధించిందని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. సవాళ్లు కాదు.. ప్రజాసేవే నాయకత్వానికి కొలమానం నాయకుడంటే కష్టకాలంలో పారిపోకుండా కార్యకర్తలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే రాము వ్యాఖ్యానించారు. నమ్ముకున్న వారిని మోసం చేయడం నాయకత్వం కాదని విమర్శించారు. రాజకీయాల్లో అనవసర సవాళ్లు విసరడం కంటే ప్రజల సమస్యలను పరిష్కరించడమే నిజమైన సమర్థతకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు పదవులను అలంకారంగా భావించకుండా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీలు అంగడాల భారతి, దుడ్ల ప్రదీప్ కుమార్, వర్రె బలరామకృష్ణ మాట్లాడుతూ తమ విజయానికి సహకరించిన ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాము నాయకత్వంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన నాయకుడు సందు పవన్, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

