51వ డివిజన్లో గంజాయి బ్యాచ్‌ల కలకలం!
అర్ధరాత్రి వేళల్లో అసాంఘిక శక్తుల సంచారంపై ఆందోళన… పోలీసుల నిఘా పెంచాలని కార్పొరేటర్ అర్షద్ ఫిర్యాదు… రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి…

విజయవాడ, నవంబర్ 9 : విజయవాడ నగరంలోని 51వ డివిజన్ పరిధిలో అర్ధరాత్రి వేళ గంజాయి బ్యాచ్‌ల సంచారం పెరిగిందని స్థానిక కార్పొరేటర్ అర్షద్ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలతో స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ కొండలరావును కలిసి పరిస్థితిని వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. డివిజన్ పరిధిలో రాత్రి సమయాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. గంజాయి సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి 51వ డివిజన్‌ను మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ అర్షద్ విజ్ఞప్తి చేశారు.

