క్రీడలతో క్రమశిక్షణ.. నాయకత్వ లక్షణాలు
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని యువతకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపు… ఘనంగా ముగిసిన రెండో ఎన్టీఆర్ మెమోరియల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్… పురుషుల్లో కేఎల్ యూనివర్సిటీ.. మహిళల్లో రామచంద్రపురం జట్లు విజేతలు…

గుడివాడ, అక్టోబర్ 16: క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పట్టుదలతో లక్ష్యసాధనకు ముందుకు సాగే స్ఫూర్తిని అందిస్తాయని పేర్కొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ఎన్టీఆర్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ గురువారం రాత్రి ముగిసింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజేత జట్లకు, ఉత్తమ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. జట్టుగా ఆడటం వల్ల పరస్పర సహకారం, సమన్వయం, బాధ్యతాయుతంగా వ్యవహరించే తత్వం అలవడతాయని చెప్పారు. ఓటమితో నిరాశ చెందకుండా, విజయంతో గర్వపడకుండా నిరంతర సాధన కొనసాగించాలని సూచించారు. వివిధ జిల్లాల క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, అనుభవాలను పంచుకునేందుకు రాష్ట్రస్థాయి పోటీలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. మహిళల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా రామచంద్రపురం జట్టు ప్రథమ స్థానాన్ని సాధించింది. ఏలూరు జిల్లా జట్టు ద్వితీయ, పల్నాడు జిల్లా జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ క్రీడాకారిణిగా హారతి, ఉత్తమ షూటర్‌గా నాగదేవి ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో కేఎల్ యూనివర్సిటీ జట్టు విజేతగా నిలవగా, సీబీసీ రాజమండ్రి జట్టు ద్వితీయ, హెచ్ ఫౌండేషన్ జట్టు తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. ఉత్తమ ఆటగాడిగా ఇంతియాజ్, ఉత్తమ షూటర్‌గా జె.హరీష్ నిలిచారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, కమిటీ నేతలు వల్లభనేని లక్ష్మీవరప్రసాద్, బొగ్గరపు తిరుపతయ్య, టీడీపీ నాయకురాలు యార్లగడ్డ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

