మాదకద్రవ్యాల నిందితుడిపై పీడీ యాక్ట్
మూడు ఎన్డీపీఎస్ కేసుల నేపథ్యంలో కఠిన చర్య… పలగిరి రహమతుల్లా అరెస్ట్… కడప కేంద్ర కారాగారానికి తరలింపు… మాదకద్రవ్యాల అక్రమ దందాకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న తిరుపతి జిల్లా ఎస్పీ…

తిరుపతి, అక్టోబర్ 5: వరుసగా మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై తిరుపతి జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన పలగిరి రహమతుల్లా (59)ను అరెస్ట్ చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రహమతుల్లాపై నమోదైన కేసులను పరిశీలించి పీడీ యాక్ట్ కింద చర్యలు చేపట్టారు. భాకరాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రహమతుల్లాపై 2021, 2022, 2024 సంవత్సరాల్లో ఎన్డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వరుసగా మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడుతున్నందున ప్రజాశాంతి, భద్రతల పరిరక్షణ కోసం పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. మాదకద్రవ్యాల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించి, వాటి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు.

