ధర్మ పరిరక్షణలో అర్చకుల పాత్ర కీలకం
ఆలయ సంప్రదాయాలను నిలబెడుతున్నది అర్చకులే… లోక కల్యాణం కోసం శ్రమించేవారిని గౌరవించడం మన బాధ్యత… ఇంద్రకీలాద్రిపై అర్చక సత్కార సభలో దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్…

విజయవాడ, అక్టోబర్ 17: సనాతన ధర్మ పరిరక్షణలో, సమాజ శ్రేయస్సులో అర్చకుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అన్నారు. తరతరాలుగా వస్తున్న వేద సంస్కృతిని, ఆలయ సంప్రదాయాలను సజీవంగా నిలబెడుతున్న అర్చకులను గౌరవించుకోవడం సమాజ బాధ్యతగా పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై శ్రీ మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన అర్చక సత్కార కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆలయాల్లో పూజాదికాలను నిష్టగా నిర్వహించడంతోపాటు ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షాన్ని ఆకాంక్షిస్తూ అర్చకులు నిత్యం జపాలు, హోమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లోక కల్యాణం కోసం శ్రమిస్తున్న వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వేద సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు వైదిక, అర్చక వర్గాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు యనమండ్ర మల్లేశ్వర శాస్త్రి, లింగంభొట్ల దుర్గాప్రసాద్ శర్మ, కుందుర్తి కనకసుందర శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉత్సవాల్లో వైదిక క్రతువులు నిర్వహిస్తున్న అర్చకులను దేవస్థానం తరఫున శాలువాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం కమిషనర్‌కు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

