పేదలకు పట్టాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమా, ప్రభుత్వ కార్యక్రమాల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్... ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ... 24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేత...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 28: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ నెల 30న నిర్వహించనున్న “పేదలకు పట్టాభిషేకం” కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్, యువ నాయకుడు బొండా సిద్ధార్థతో కలిసి సోమవారం సాయంత్రం స్టేడియాన్ని సందర్శించారు. వేదిక, లబ్ధిదారుల సీటింగ్, వాహనాల పార్కింగ్, రాకపోకలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా

24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇళ్లపై చట్టబద్ధమైన హక్కు లభించనుందని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని బొండా ఉమా సూచించారు. తాగునీరు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలన్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా సూచిక బోర్డులు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు, నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుడు ఎలాంటి అసౌకర్యం లేకుండా పట్టా తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్లేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొండా ఉమా కోరారు.

