సింగపూర్ హోంమంత్రితో కలిసి శ్రీవారి సేవలో లోకేష్
తిరుమలలో కే షణ్ముగంకు స్వాగతం పలికిన మంత్రి... ఇరువురికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు... రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
తిరుమల, సెప్టెంబర్ 29: రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కే షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న సింగపూర్ హోంమంత్రి షణ్ముగంకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ఆయనను ఆలయానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి

ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్, షణ్ముగం కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.

