గుడివాడలో ఇంటింటికీ టీడీపీ.. ప్రజల చెంతకు ఎమ్మెల్యే రాము
15వ వార్డులో విస్తృత పర్యటన.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరణ... ఓల్డ్ బైపాస్ రోడ్డులో గోతుల పరిశీలన.. వెంటనే పూడ్చాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం... గుడ్మేన్పేట, నైజాంపేటలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 12: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
గుడివాడ పట్టణంలోని 15వ వార్డులో బుధవారం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే రాము విస్తృతంగా పర్యటించారు. ఓల్డ్ బైపాస్ రోడ్డుకు చేరుకున్న ఆయనకు స్థానికులు, కూటమి శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పర్యటనలో ఓల్డ్ బైపాస్ రోడ్డులో ఏర్పడిన గోతులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గోతులను వెంటనే పూడ్చి రహదారిని సుగమం చేయాలని సూచించారు.

అనంతరం గుడ్మేన్పేట, నైజాంపేట ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రచార కరపత్రాలను అందజేశారు.
ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్‌డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

