ధరల భారానికి రాయితీతో ఉపశమనం
రూ.75 పలుకుతున్న ఉల్లిపాయలు రూ.35కే విక్రయం... రాష్ట్రవ్యాప్తంగా 115 రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు... త్వరలో సంచార వాహనాల ద్వారా ప్రజల వద్దకే సరఫరా...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 30: బహిరంగ మార్కెట్లో పెరిగిన ఉల్లిపాయల ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రాయితీ విక్రయాలను ప్రారంభించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీ రైతుబజార్లో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించే ప్రత్యేక కేంద్రాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.75 వరకు పలుకుతున్న నేపథ్యంలో ప్రజలపై భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 115 రైతుబజార్లలో కిలో రూ.35కే ఉల్లిపాయలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. నాగ్పూర్ నుంచి అవసరమైన ఉల్లిపాయల నిల్వలను తెప్పించేందుకు జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య సహకరిస్తోందన్నారు. రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాష్ట్రానికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో సంచార విక్రయ కేంద్రాలు, చిన్న సరకు వాహనాల ద్వారా ప్రజల నివాస ప్రాంతాలకే ఉల్లిపాయలను తీసుకెళ్లి తక్కువ ధరకు విక్రయిస్తామన్నారు. అంతర్జాతీయంగా

నెలకొన్న యుద్ధ వాతావరణం, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎల్నినో ప్రభావం కారణంగా ఉల్లిపాయల ధరలు పెరిగాయని మంత్రి వివరించారు. మరింత నాణ్యమైన సరుకును ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉల్లిపాయలతోపాటు కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమపిండిని కూడా రాయితీ ధరలకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి చిన్న దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందుబాటు ధరల్లో అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో బియ్యం ధరలు పెరిగిన సమయంలో రాయితీ ధరలకు సరఫరా చేశామని, ప్రస్తుతం ఉల్లిపాయలను కిలో రూ.35కే అందిస్తున్నామని తెలిపారు. మరింత నాణ్యమైన ఉల్లిపాయలను తీసుకురావాలని అధికారులను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, కోనేరు రాజేష్, కోవ్వూరి కిరణ్, జాస్తి సురేష్, కోడూరు ఆంజనేయ వాసు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

