ఇంటింటికీ టీడీపీ.. ప్రజల సమస్యలపై నేరుగా ఆరా
37వ డివిజన్లో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పర్యటన... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నేతలు... స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా...

విజయవాడ, ఆగస్టు 26: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్ పాత శివాలయం ప్రాంతంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను పలకరించారు. వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలని సూచించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాలనలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి నుంచి వచ్చే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు అమర మురళి, సురభి బాలు, పిళ్లా సుదర్శన్, సొలంకి రాజ్, ఎస్. కిరణ్, ఈగల సాంబ, కొప్పుల గంగాధర్ రెడ్డి, కుంచం దుర్గారావు, పేరం సత్యనారాయణ, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

