అన్నప్రసాదం ప్రైవేటీకరణ లేదు.. నిర్వహణ దేవస్థానానిదే
‘ప్రైవేటుకు ప్రసాదం’ ప్రచారం అవాస్తవం: దుర్గగుడి ఈవో స్పష్టీకరణ... భక్తులకు పరిశుభ్ర, ఆరోగ్యకర అన్నప్రసాదం కోసం అత్యాధునిక మెకనైజ్డ్ కిచెన్... ఆధునిక పరికరాల ఏర్పాటుతో దేవస్థానానికి రూ.36.82 లక్షల ఆదా...

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 26: ఇంద్రకీలాద్రిపై భక్తులకు అందించే అన్నప్రసాదం తయారీ, పంపిణీని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్పష్టం చేశారు. నిత్యాన్నదాన నిర్వహణ నుంచి భక్తులకు వడ్డించే వరకు మొత్తం ప్రక్రియ దేవస్థానం ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని తెలిపారు.
భక్తులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని వేగంగా అందించేందుకు మాత్రమే అత్యాధునిక స్టీమ్ ఆధారిత మెకనైజ్డ్ కిచెన్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నప్రసాద తయారీ, పంపిణీ బాధ్యతలను ఏ ప్రైవేట్ సంస్థకూ అప్పగించడం లేదని స్పష్టం చేశారు.
నిర్వహణ మొత్తం దేవస్థానానిదే
నిత్యాన్నదాన పథకం నిర్వహణ, పర్యవేక్షణ, మెనూ నిర్ణయం, నాణ్యతా ప్రమాణాలు, భక్తులకు వడ్డించే ప్రక్రియ యథావిధిగా దేవస్థానం నియంత్రణలోనే ఉంటాయని ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆహార తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆహార వృథాను తగ్గించేందుకు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు ఆధునిక స్టీమ్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
రూ.36.82 లక్షల నిధుల ఆదా
టీటీడీలో మెకనైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసిన టెక్నోలాజిక్ ఇంజనీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పరికరాల సరఫరా, ఇన్‌స్టాలేషన్‌కు రూ.2,31,82,668 కోట్ చేయగా, హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్/అక్షయపాత్ర ఫౌండేషన్ అదే తరహా ఆధునిక పరికరాలను రూ.1.95 కోట్లకు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. దీంతో దేవస్థానానికి రూ.36,82,668 ఆదా అవుతుందని తెలిపింది.
ఈ ప్రతిపాదనను ఆలయ ధర్మకర్తల మండలి పరిశీలించి ఆమోదించిందని, ప్రభుత్వం కూడా ఆగస్టు 20న అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది.
రోజుకు 10 వేల మందికి వంట చేసే సామర్థ్యం
అక్షయపాత్ర ఫౌండేషన్ బాధ్యత కేవలం రోజుకు సుమారు 10 వేల మందికి ఆహారం తయారు చేసే సామర్థ్యం కలిగిన స్టీమ్ కుకింగ్ పరికరాలు, స్టెయిన్‌లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ పాత్రలు, యుటిలిటీ సిస్టమ్‌ల ఏర్పాటు, కమిషనింగ్‌తో పాటు దేవస్థాన సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇవ్వడం వరకే పరిమితమని ఈవో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం సాంకేతిక పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
అలాగే ప్లేట్‌కు నిర్దిష్ట మొత్తం చెల్లిస్తూ దేవస్థానంపై ఏటా రూ.6 కోట్ల అదనపు భారం పడుతుందన్న ప్రచారాన్ని ఈవో ఖండించారు. అన్నప్రసాద నిర్వహణ లేదా పంపిణీకి ఎలాంటి ప్రైవేట్ కాంట్రాక్టు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు అత్యున్నత నాణ్యతతో అన్నప్రసాదం అందించేందుకు చేపడుతున్న ఆధునికీకరణ చర్యలపై జరుగుతున్న నిరాధార ప్రచారాలను నమ్మవద్దని దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది.

