రక్తపు చుక్కతో ప్రాణానికి భరోసా
రక్తదానం మానవతకు ప్రతీక: ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య... రక్తదాతలను అభినందించిన ఎమ్మెల్యే... ప్రేమ, దయ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపు...

నందిగామ, ఆగస్టు 26: రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే ప్రతి రక్తదాత అభినందనీయుడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.
ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామలోని ప్రతిభ హైస్కూల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సౌమ్య సందర్శించారు. ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులతో కలిసి శిబిరాన్ని పరిశీలించిన ఆమె రక్తదానం చేస్తున్న యువతను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం అందించి ప్రాణాలను కాపాడటం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. రక్తానికి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు ఉండవని.. ఒకరి రక్తం మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుందని అన్నారు. సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇటువంటి రక్తదాన శిబిరాలు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.
ప్రవక్త బోధించిన ప్రేమ, దయ, సేవాభావాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పరస్పరం సహకరించుకుంటూ సోదరభావంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో శాంతి, సామరస్యం మరింత బలపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, రక్తదాతలు పాల్గొన్నారు.

