సీసీ కెమెరాలకు చిక్కిన ఐఫోన్ చోరీ!
గంటల వ్యవధిలోనే భక్తురాలి ఫోన్‌ను గుర్తించిన పోలీసులు… అన్నదాన కేంద్రంలో ఐఫోన్ తీసుకెళ్లిన బాలుడి గుర్తింపు… ముఖ గుర్తింపు సాంకేతికతతో ఫోన్ స్వాధీనం… బాధితురాలికి అప్పగింత...

విజయవాడ, అక్టోబర్ 11: దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తురాలి ఐఫోన్‌ను తీసుకెళ్లిన బాలుడిని విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించారు. గంటల వ్యవధిలోనే ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఆదివారం దుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చారు. అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న సమయంలో ఆమె ఐఫోన్‌ను ఓ బాలుడు తీసుకెళ్లాడు. ఫోన్ కనిపించకపోవడంతో బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అన్నదాన కేంద్రంలోని సీసీ కెమెరాల్లో ఫోన్ తీసుకెళ్లిన బాలుడిని గుర్తించారు. అతడి చిత్రాన్ని ముఖ గుర్తింపు వ్యవస్థలో నమోదు చేసి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాంకేతిక నిఘా ఆధారంగా బాలుడిని గుర్తించి ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధితురాలికి ఫోన్‌ను అందజేశారు. పోగొట్టుకున్న విలువైన ఫోన్‌ను తక్కువ సమయంలోనే గుర్తించి అందించిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భక్తుల భద్రతతో పాటు వారి వస్తువుల రక్షణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

