ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం
▪️ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని దుర్గాఘాట్‌లో ప్రత్యేక పూజలు... ▪️ కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి వేద పండితుల వరుణ పారాయణం... ▪️ తాగు, సాగునీటికి కొరత లేకుండా.. రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 14 (V10TV): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగానికి సంబంధించిన ప్రత్యేక పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
పవిత్ర కృష్ణానది తీరంలోని శ్రీ దుర్గా స్నానఘాట్‌లో ఉదయం 6.15 గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి నదులు, చెరువులు, జలాశయాలు నిండాలని, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉండాలని వేద పండితులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వరుణ అనువాక సహిత పారాయణాలు నిర్వహించారు. ప్రత్యేకంగా పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి సకాలంలో వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ వేద మంత్రాలను పఠించారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలకు అవసరమైన నీరు సమృద్ధిగా లభించి రైతాంగం ఆనందంగా ఉండాలనే సంకల్పంతో వరుణ యాగ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

