తెలంగాణ పోరాట యోధుడు వెంకటస్వామికి ఘన నివాళి
గుంటూరు అంబేడ్కర్ భవన్‌లో 97వ జయంతి వేడుకలు… వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసిన దళిత సంఘాల నేతలు… కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ‘కాకా’ చేసిన సేవలు చిరస్మరణీయం…

గుంటూరు, అక్టోబర్ 5: మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ కార్మిక నేత, తెలంగాణ పోరాట యోధుడు గడ్డం వెంకటస్వామి ‘కాకా’ 97వ జయంతి వేడుకలను గుంటూరు నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికుల హక్కుల పరిరక్షణతోపాటు దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి వెంకటస్వామి తన జీవితాంతం కృషి చేశారని నాయకులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, కేంద్ర మంత్రిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, భీమ్‌సేన్ సేవాదళ్ అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, బత్తుల అనిల్, తిప్పాబత్తిన గోవిందు, దార్ల అర్జున్, విప్పర్ల ముత్తయ్య, వట్టిమొక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

