పెళ్లి పేరుతో బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్
ప్రేమ, వివాహం పేరుతో నమ్మించి పలుమార్లు దాడి చేసినట్లు ఫిర్యాదు… పోక్సో, ఎస్సీ–ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు… మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జయకృష్ణ వెల్లడి…

ఉయ్యూరు, అక్టోబర్ 7: ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో సాయిపురం గ్రామానికి చెందిన కూచిపూడి రాంబాబు (23)ను బుధవారం అరెస్ట్ చేసినట్లు గన్నవరం డీఎస్పీ కే. జయకృష్ణ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితం ఉయ్యూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాంబాబుతోపాటు మరికొందరిపై కేసు నమోదైందన్నారు. మెకానిక్‌గా పనిచేస్తున్న రాంబాబు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బాధితురాలు మైనర్‌గా ఉన్న సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని డీఎస్పీ వివరించారు. ఆమె మేజర్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని కోరగా, కులాన్ని కారణంగా చూపుతూ నిరాకరించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో బీఎన్ఎస్, పోక్సో, ఎస్సీ–ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి రాంబాబును అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసులో మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని, లభించే ఆధారాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తులో ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు, ఎస్సై మల్లికాసులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. వేధింపులు, లైంగిక దాడులకు గురైనవారు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ అవసరమైన రక్షణ, సహాయం అందిస్తామని తెలిపారు.

