పంచాయతీ ఎన్నికలపై పోలీసుల డేగకన్ను!
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశం… రెంటచింతల, గురజాల పోలీస్ స్టేషన్లలో ఎన్నికల బందోబస్తుపై సమీక్ష… ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా భద్రత కల్పించాలని స్పష్టీకరణ…

గురజాల, నవంబర్ 10 : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి పోలీసు అధికారులను ఆదేశించారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలోని రెంటచింతల, గురజాల పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక గ్రామాల్లో పరిస్థితులు, ముందస్తు భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల ఏఎస్పీ ఎం. మహేశ్వరరావు, కారంపూడి రూరల్ సర్కిల్ సీఐ భాస్కరరావు, గురజాల సీఐ మురళి, ఎస్‌ఐలు నాగార్జున, వినోద్ కుమార్‌తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

