ఓటరు జాబితాలో పేరు లేదా?.. మరో అవకాశం!
ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులకు ప్రత్యేక అవకాశం… నవంబర్ 20లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు… అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం…

కడప, నవంబర్ 10 : ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గైర్హాజరు, నివాస మార్పు, మరణం, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు ఉండటం వంటి కారణాలతో ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారి వివరాలను సంబంధిత పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, పురపాలక కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారిక వెబ్సైట్లోనూ వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. సంబంధిత ఓటర్లకు బూత్ స్థాయి అధికారులు నమోదు పత్రాలను అందజేస్తారని, అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్లకు వాట్సాప్, సందేశాల ద్వారా కూడా పంపిస్తారని తెలిపారు. పాత ఓటరు గుర్తింపు సంఖ్య ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా ఈసీఐనెట్ యాప్ ద్వారా నమోదు పత్రాలను పొందవచ్చన్నారు. గతంలో ఉన్న చిరునామాలోనే నివసిస్తున్న వారు నమోదు పత్రంతోపాటు అనుబంధం-బి ప్రకటన సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మారిన వారు కొత్త చిరునామా వివరాలతో అనుబంధం-సి జతచేయాలని తెలిపారు. వీరు ప్రత్యేకంగా ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. చిరునామా ఆధారాలు లేని నిరాశ్రయులకు బూత్ స్థాయి అధికారి పరిశీలన నివేదిక ఆధారంగా నివాస ధ్రువీకరణ కల్పిస్తారని వివరించారు. ఇప్పటికే కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను తుది ఓటరు జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు. గతంలో కేటాయించిన ఓటరు గుర్తింపు సంఖ్యనే తిరిగి కేటాయిస్తారని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 20వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

