కంపచెట్లలో మృతదేహం.. గుత్తి శివారులో కలకలం!
బైక్‌తో సహా కంపచెట్లలో పడి వ్యక్తి మృతి… మృతుడు కమటం వీధికి చెందిన బోయ శివగా గుర్తింపు… ప్రమాదమా.. మరేదైనా కారణమా? పోలీసుల ఆరా…

గుత్తి, నవంబర్ 10 : గుత్తి పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. లచ్చాన రోడ్డు సమీపంలోని కంపచెట్లలో బైక్‌తో సహా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గుర్తించారు. మృతుడు గుత్తి పట్టణంలోని కమటం వీధికి చెందిన బోయ శివగా పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ సురేష్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభించిన ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా మృతుడి వివరాలను సేకరించారు. శివకు రెండేళ్ల క్రితం వివాహమైనట్లు సమాచారం. గత కొంతకాలంగా కొంగనపల్లికి చెందిన ఓ మహిళతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా టపాసులు తీసుకుని కొంగనపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే బైక్ అదుపుతప్పి కంపచెట్లలో పడిపోవడంతో మృతి చెందాడా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
