భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవత్వం వెల్లివిరిసింది!
మంచినీరు, మజ్జిగతో భక్తులకు ఉపశమనం.. పసిపిల్లలకు వేడి పాలు... సేవలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు... వృద్ధులు, మహిళలు, చిన్నారులకు అండగా యువత.. అధికారుల సమన్వయంతో సేవా కార్యక్రమాలు...

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారింది. ఓవైపు అమ్మవారి నామస్మరణతో కొండ మార్మోగుతుండగా.. మరోవైపు భక్తులకు అందుతున్న సేవలు మానవత్వాన్ని చాటుతున్నాయి. కనకదుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, యువ వాలంటీర్లు ముందుకొస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న వారికి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తూ ఉపశమనం కల్పిస్తున్నారు. పసిపిల్లలతో వచ్చిన కుటుంబాల అవసరాలను గుర్తించి వేడి పాలు అందిస్తున్నారు. సేవలో యువత.. భక్తులకు ఆపన్నహస్తం వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. క్యూలైన్లలో క్రమశిక్షణ పాటించేలా సహకరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పర్యవేక్షణలో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భక్తుల భద్రత, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, వాలంటీర్లు సమన్వయంతో సేవలు అందిస్తున్నారు.

