సుదీర్ఘ కూటమి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి: ఎంపీ పుట్టా మహేష్
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తొలగిన అడ్డంకులు… రూ.2.50 కోట్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన… పెన్షన్ల కోసం ఏటా రూ.32 వేల కోట్లకు పైగా వ్యయం…

చింతలపూడి, అక్టోబరు 1: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే మరో 15 నుంచి 20 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అయ్యపరాజుగూడెం–కలరాయణగూడెం మధ్య రూ.2.50 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అయ్యపరాజుగూడెంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ‘పేదల సేవలో 2.0’ గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వివిధ వర్గాల లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సామాజిక భద్రత పింఛన్ల కోసం ప్రభుత్వం ఏటా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రహదారులు, డ్రైనేజీలు, శ్మశానవాటికల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. చింతలపూడికి త్వరలో జలకళ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ వెల్లడించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం పూర్తయితే చింతలపూడి, నూజివీడు మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. చెరువులు నిండడంతోపాటు భూగర్భ జలమట్టాలు పెరిగి తాగునీటి సమస్యలు కూడా తగ్గుతాయని ఎంపీ పేర్కొన్నారు.

