సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి!
వీఐపీల రాకతో సాధారణ భక్తుల దర్శనానికి ఆటంకం కలగొద్దు… ఘాట్ రోడ్డు నుంచి మహామండపం వరకు క్యూలైన్ల పరిశీలన… రద్దీ నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు…

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై క్యూలైన్ల నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రముఖులు, వీఐపీలు వరుసగా అమ్మవారి దర్శనానికి వస్తున్నందున సాధారణ క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఘాట్ రోడ్డు, ఓం టర్నింగ్, మహామండపం మీదుగా సాగే క్యూలైన్లలో భక్తుల కదలికలను పరిశీలించారు. రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దర్శనాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్యూలైన్లలో భక్తుల రాకపోకలకు ఆటంకాలు లేకుండా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ తనిఖీల్లో దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.

