బెజవాడలో భగ్గుమన్న పాత్రికేయులు!
ఉత్సవాల కవరేజీకి మీడియా పాసుల జారీలో జాప్యంపై ఆగ్రహం… దుర్గగుడి, పోలీస్, రెవెన్యూ, సమాచార శాఖల తీరుపై పాత్రికేయుల అసంతృప్తి… నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నాకు సన్నాహాలు…

విజయవాడ, అక్టోబర్ 11: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధులకు పాసుల జారీలో జాప్యం జరుగుతోందంటూ విజయవాడలో జర్నలిస్టుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పరిగణించే పత్రికా రంగాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దసరా ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న దుర్గగుడి అధికారులు, పోలీస్ శాఖ,జిల్లా యంత్రాంగం, సమాచార శాఖ సమన్వయంతో మీడియా పాసుల సమస్యను పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంపై జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లలో లోపాలను వెలుగులోకి తీసుకువస్తారనే ఉద్దేశంతోనే పాసుల జారీలో నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అనుమానాలను కొందరు పాత్రికేయులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు అధికారిక ధ్రువీకరణ లేదు. మీడియా ప్రతినిధులకు పాసులు అందజేయకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం మోడల్ గెస్ట్‌హౌస్ నుంచి దుర్గగుడి వరకు నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించేందుకు జర్నలిస్టులు సిద్ధమవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టేందుకు సన్నాహాలుచేస్తున్నట్లు సమాచారం. దసరా ఉత్సవాల కవరేజీకి ఆటంకాలు లేకుండా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు వెంటనే పాసులు జారీ చేయాలని కోరుతున్నారు. భక్తుల సౌకర్యాలు, ఉత్సవాల నిర్వహణలో పారదర్శకత, ప్రజా సమస్యలపై సమాచారాన్ని అందించడంలో మీడియా పాత్ర కీలకమని, అధికార యంత్రాంగం దీనిని గుర్తించాలని పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు. మీడియా పాసుల జారీపై సంబంధిత శాఖలు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.

