దుర్గమ్మ దసరాకు సాంకేతిక రక్షణ కవచం
ఏఐ ప్రదర్శన బోర్డులు, చిన్నారులకు గుర్తింపు పట్టీలు, బూమ్ బ్యారియర్లు… 3,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.. 22 ప్రాంతాల్లో వాహనాల నిలుపుదల… సామాన్య భక్తుల సౌకర్యమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 3: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. సామాన్య భక్తుల భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. మొత్తం 3,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 22 ప్రాంతాల్లో వాహనాల నిలుపుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ శనివారం సమన్వయ శాఖల అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, దేవాదాయ, జలవనరులు, రహదారులు–భవనాల శాఖలకు చెందిన అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, భక్తుల నిరీక్షణ ప్రాంతాలు, వినాయకుడి ఆలయం, రథం కూడలి, టోల్గేట్, ఘాట్రోడ్డులో అధికారులు కాలినడకన పర్యటించారు. భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, దర్శన మార్గాలు, వాహనాల నిలుపుదల, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీపడవద్దని, ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలూ నిఘా ఉత్సవాల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత ప్రదర్శన బోర్డులు, చిన్నారులకు గుర్తింపు పట్టీలు, బూమ్ బ్యారియర్లు,

ప్రవేశ నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక విశ్లేషణ వ్యవస్థను వినియోగిస్తామన్నారు. ఇరవై నాలుగు గంటలూ పనిచేసే కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. మూడు నిరీక్షణ ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. యువ, చురుకైన పోలీసు సిబ్బందిని కీలక ప్రాంతాల్లో విధులకు నియమిస్తామన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. పున్నమిఘాట్లో జాతీయ సరస్ మేళా దసరా ఉత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. భక్తుల రాకపోకలు, దర్శనం, క్యూలైన్లు, వాహనాల నిలుపుదల, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పున్నమిఘాట్లో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాకు రాష్ట్రపతి హాజరుకానున్న నేపథ్యంలో మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, దర్శనాల సమయంలో భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక శోభను ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

