రేషన్ తీసుకోని కార్డులపై కేంద్రం నిఘా
దేశవ్యాప్తంగా కోటీ 58 లక్షల కార్డులపై కేంద్రం దృష్టి... వెంటనే రద్దు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేత.. అర్హత నిరూపించుకునేందుకు మూడు నెలల గడువు...

ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని కోటీ 58 లక్షల కార్డులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయా కార్డులను వెంటనే జాబితా నుంచి తొలగించకుండా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. నిజమైన లబ్ధిదారులు తమ అర్హతను నిరూపించుకునేందుకు మూడు నెలల గడువు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ గడువులో ఈ–కేవైసీ పూర్తి చేస్తే రేషన్ కార్డును తిరిగి క్రియాశీలం చేసే అవకాశం ఉంటుంది.

