దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు: ఎలిజబెత్ రాణి
కూటమి పాలనలో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన... మహిళలకు ఉపయోగపడే దిశ చట్టాన్ని కూడా రద్దు చేశారని విమర్శ... ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 — V10TV AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదని గన్నవరం మండలం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడారు.
స్వాతంత్య్రం సాధించి దశాబ్దాలు గడుస్తున్నా పేదరికం, నిరక్షరాస్యత, మహిళలపై అఘాయిత్యాలు, సామాజిక అసమానతలు కొనసాగుతుండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. మహిళల రక్షణకు ఉపయోగపడే దిశ చట్టాన్ని కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.


ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, 50 ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్, ఉచిత గ్యాస్, వలంటీర్లకు రూ.10 వేల వేతనం తదితర హామీలు ఇచ్చారని, వాటి అమలుపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. రైతులు అప్పుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యారంగంలో చేపడుతున్న మార్పులు పేద విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నాయని ఆమె విమర్శించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిందని ఎలిజబెత్ రాణి పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులు, యువతలో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా స్పందించాలని ఆమె కోరారు.

