9వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి తరఫున దేవినేని అవినాష్ ప్రచారం
కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వ్యాఖ్య... వైసీపీ హయాంలోనే డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి... కార్పొరేటర్, మేయర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

విజయవాడ, అక్టోబర్ 29 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ గురువారం నిమ్మతోట సెంటర్, కొండపైన ప్రాంతం, సున్నంబట్టీల సెంటర్, శివగిరి కొండ ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేపట్టారు. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పడాల రూపారెడ్డితో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని విమర్శించారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి వైసీపీకి సానుకూల స్పందన వస్తోందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో తాగునీటి ప్లైన్లు, మెట్ల మార్గాలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంతో పాటు సుందరయ్య నగర్లో రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో యువతి రూపారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఆమె రూపొందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్పొరేటర్, మేయర్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అవినాష్ కోరారు.

