తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
అర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు సీఎం చంద్రబాబు… నీటమునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న కొబ్బరి, అరటి తోటల పరిశీలన… కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టంపై ఆరా…

అమరావతి, అక్టోబర్ 29: అర్నబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. అమరావతి నుంచి కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు ప్రాంతానికి బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావంతో నీటమునిగిన వరి పొలాలు, దెబ్బతిన్న అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను గగనతలం నుంచి పరిశీలించారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. తుఫాను కారణంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం, పంటల పరిస్థితి, ముంపు తీవ్రతపై ముఖ్యమంత్రికి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం స్వయంగా పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.

