దివ్యాంగులకు సులభంగా దుర్గమ్మ దర్శనం
ఈవో శీనా నాయక్ ఆదేశాలతో ప్రత్యేక ఏర్పాట్లు… వాహనాలు, చక్రాల కుర్చీలతో ఆలయ సిబ్బంది సేవలు… దర్శనం సులభంగా కల్పించడంపై భక్తుల హర్షం…

విజయవాడ, అక్టోబర్ 20: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న దివ్యాంగులకు ఆలయ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈవో శీనా నాయక్ ఆదేశాల మేరకు రద్దీలో ఇబ్బందులు ఎదురవకుండా సిబ్బంది వారికి సహాయం అందిస్తున్నారు. ఓం టర్నింగ్ వద్ద నుంచి ప్రత్యేక వాహనాల్లో దివ్యాంగులను తరలిస్తూ, అవసరమైన చోట చక్రాల కుర్చీల సాయంతో అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తున్నారు. దర్శనం పూర్తయ్యే వరకు సిబ్బంది తోడుగా ఉంటూ సేవలందిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తమ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం సులభంగా పూర్తయ్యేలా సిబ్బంది చూపిన ఆదరణ తమ మనసును హత్తుకుందని తెలిపారు. ప్రత్యేక సదుపాయాలు కల్పించిన ఈవో శీనా నాయక్‌కు, సేవలందించిన సిబ్బందికి దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

